శ్రీనగర్ నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు: 9 మంది మృతి, డీజీపీ ప్రకటన
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ శివారు ప్రాంతంలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందగా, 32 మంది గాయపడ్డారని జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వెల్లడించారు.
గాయపడిన వారిలో 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. మరణించిన 9 మందిలో ముగ్గురు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం సభ్యులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఇతర ఉద్యోగులు ఉన్నట్లు డీజీపీ ప్రభాత్ తెలిపారు.
పోలీస్ స్టేషన్ లోపల అమ్మోనియం నైట్రేట్ (పేలుడు పదార్థం) నిల్వ ఉంచగా, అది ప్రమాదవశాత్తూ పేలిపోయినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ లోపల ఉంచిన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు.
అధికారుల కథనం ప్రకారం, ఒక 'వైట్ కాలర్' టెర్రర్ మాడ్యూల్ కేసుకు సంబంధించిన పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీసుకుంటున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు పదార్థాలను హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి తీసుకొచ్చారు.
స్థానికుడు తారిఖ్ అహ్మద్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, "శుక్రవారం రాత్రి 11:22 గంటలకు పెద్ద పేలుడు జరిగింది. మేం భయపడ్డాం. పోలీస్ స్టేషన్లో ఏదో జరిగిందని అర్థం కావడానికి 15-20 నిమిషాలు పట్టింది. మేం పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి మొత్తం పొగ కమ్ముకుంది, మృతదేహాలు పడి ఉన్నాయి. మా స్నేహితులు, పొరుగువారు కూడా ఈ ఘటనలో చనిపోయారు" అని తెలిపారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Please log in or register to post a comment.